ఎన్టీఆర్ వర్థంతి: ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు.. ప్రభంజనం
అమరావతి: తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్థంతిని కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన తాతగారు ఎన్టీఆర్‌ను తలుచుకున్నారు.
‘‘ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు.. అది ప్రభంజనం. అది ఒక సంచలనం. తెలుగువాడి విశ్వరూపం. వెండితెరపై రారాజుగా వెలుగొందిన మా తాతగారు, రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు. తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైంది. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లని నినదించి కోట్లాది హృదయాల్లో నిలిచిన మా తాతగారే నాకు నిత్యస్ఫూర్తి. ఆ మహనీయునికి 29వ వర్థంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను’’ అని నారా లోకేష్ స్మరించుకున్నారు.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ 29వ వర్థంతిని ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఏపీవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని టీడీపీ హై కమాండ్ పిలుపునిచ్చింది. సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, సమాజానికి ఉపయోగపడే ఇతర సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మైదుకూరులో నివాళులు
కడప జిల్లాలోని మైదుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ‘‘స్వచ్చాంధ్ర స్వచ్చదివస్’’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ వర్ధంతితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.
ఎన్టీఆర్ విగ్రహాల వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించనున్నారు. ఈ కార్యక్రమాలు ఎన్టీఆర్ మహానేతగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేలా ఘనంగా జరగనున్నాయి.
మరికొన్ని

One thought on “ఎన్టీఆర్ వర్థంతి: తెలుగుదనానికి ప్రతిరూపం”
Comments are closed.