చెన్నై: పొలంలో పడిన ‘ఏనుగు బెలూన్’
పొంగల్ పండుగ సందర్భంగా కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చిపట్టి మైదానంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ బెలూన్ల పండుగలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ బెలూన్ల పోటీలో ఫ్రాన్స్, బ్రెజిల్, వియత్నాం సహా ఎనిమిది దేశాల నుండి తెప్పించిన ఏనుగు, పులి, ఎలుగుబంటి, ఎద్దు వంటి ఆకారాల భారీ బెలూన్లను ఆకాశంలో ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఏనుగు ఆకారంలో ఉన్న బెలూన్ ఎగిరింది. ఇందులో విదేశీ పైలెట్లు ఇద్దరూ, వారితో పాటు ఇద్దరు బాలికలు ప్రయాణించారు. ఆ బెలూన్ ఆచ్చిపట్టి మైదానం నుండి 3 కి.మీ. దూరం వరకు ఆకాశంలో ఎగిరింది. అయితే బెలూన్‌ను సురక్షితంగా కింద దింపే ప్రయత్నం చేస్తుండగా, గాలి వేగం అకస్మాత్తుగా అధికం కావటంతో బెలూన్ దిశ తప్పి 30 కి.మీ. దూరం ప్రయాణించింది. చివరికి అది కేరళ రాష్ట్రంలోని కన్నిమారి ముల్లతట్టు అనే ప్రాంతంలో ఉన్న పంట పొలంలో కూలిపోయింది.
ప్రాణాపాయం తప్పింది
ఈ ఘటనలో బెలూన్‌లో ప్రయాణించిన నలుగురూ సురక్షితంగా బయటపడ్డారు. పొలంలో పడిన బెలూన్‌ను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బెలూన్ ఫెస్టివల్ నిర్వాహకులు వెంటనే అక్కడకు చేరుకొని బెలూన్‌లో చిక్కుకున్న నలుగురిని సురక్షితంగా వెలికితీశారు.
ఈ సంఘటన చుట్టుపక్కల అందరినీ ఆసక్తికి గురి చేయగా, అపశ్రుతి జరగకుండా సవ్యంగా చర్యలు తీసుకున్న నిర్వాహకులపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.
ఈవార్తను కూడా చదవండి:
